Description
సుమారు అయిదు వందల సంవత్సరాలకు పూర్వం ఐరోపా నుంచి శ్వేత జాతీయులు అమెరికాకు వలస వెళ్లటం ప్రారంభించారు. ఉత్తర అమెరికాలో నివసించే ఆదివాసులయిన రెడ్ ఇండియన్ల (ఇప్పుడు వాళ్లని నేటివ్ అమెరికన్లు అని అంటున్నారు) పై దాడులు చేస్తూ క్రమంగా వారి భూములను ఆక్రమించుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో రెడ్ ఇండియన్ల ధైర్య సాహసాల గురించి ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో శాంతిభద్రతల స్థాపన కోసం ఒక నేటివ్ అమెరికన్ తెగ ప్రయత్నించింది. ఆ తెగ నాయకుడు సియాటిల్ ఇరువర్గాలు కలిసి మెలిసి జీవించటం మంచిదని విశ్వసించాడు. వాళ్ల భూమి కొంటానని శ్వేత జాతీయుల సైన్యాధిపతి కబురు పంపినప్పుడు సియాటిల్ ఇచ్చిన జవాబే ఈ ‘ప్రముఖుడికి లేఖ’. ఈ లేఖను రెడ్ ఇండియన్ల మహాసభలో సియాటిల్ చదివాడు. లేఖలో అప్పుడు ఆయన ప్రస్తావించిన విషయాలకి, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన అంశాలకి నేటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది.