Description
భూమి మీద చేస్తున్న ప్రయోగాలను అంగారక గ్రహం మీద చెయ్యటానికి ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ ప్రసాద్‌కి అవకాశం లభిస్తుంది. భార్య శివానీని ఒప్పించి, కొడుకు అయాన్‌తో కలిసి అంగారక గ్రహం మీదకి వెళ్లాడు.
తమ ఇంటిలో విసుగుచెందిన అయాన్ అంగారక గ్రహం మీద ఇంకేమి ఉన్నాయో చూద్దామని రోవర్‌లో ఒక రోజు బయలుదేరాడు. రాళ్లు, రప్పలూ, నారింజ రంగులో ఎగిరే ధూళి తప్పించి ఏదీ కనపడక పోయేసరికి తమ నివాసం నుంచి అనుకున్న దానికంటే చాలా దూరం వెళ్లిపోయాడు అయాన్. దాంతో అతడిని మర్షియన్లు కిడ్నాప్ చేసి వాళ్ల స్థావరానికి తీసుకుని వెళ్లారు.
గుప్పెడు మంది కలుగుల్లో ఎలకల్లా దాక్కుని ఉంటారని, వాళ్లపై తాము అంతిమ విజయం సాధించామని జగదీష్ ప్రసాద్ గొప్పలు చెప్పుకున్నాడు. అయితే, మానవులతో ఎప్పుడూ స్నేహసంబంధాలను కోరుకున్న మార్షియన్లు తప్పనిసరి పరిస్థితులలో యుద్ధానికి ఏర్పాట్లు చేసుకోసాగారు. చెర నుంచి అయాన్‌ని మార్షియన్ల చీఫ్ కొడుకు తప్పించి అతడికి ఒక ప్రతిపాదన చేశాడు.
ఆ ప్రతిపాదన ఫలించిందా? ఏది అసలయిన అంతిమ విజయం?
భవిష్యత్తులో వందేళ్ల ముందుకి తీసుకుని వెళ్లే ఈ నవల చదివి ఏం జరిగిందో తెలుసుకోండి.
ఈ పుస్తకానికి రాహక్ బొమ్మలు వేశారు.
పిల్లలలో తెలుగు చదివే సామర్ధ్యాన్ని పెంచటానికి, పుస్తకాల పట్ల ప్రేమ కలిగించటానికి రచయితల నుంచి 10 ఏళ్ల పైబడిన పిల్లల కోసం నవలలను తానా – మంచి పుస్తకం ఆహ్వానించాయి. వాటిల్లో 2021లో బహుమతికి ఎంపికైన నవలలో ఇది ఒకటి.