Description
పెరుమాళ్ మురుగన్ రాసిన Pyre నవలను తెలుగులోకి ‘చితి’గా అనువదించి మంచి పుస్తకం నుంచి ప్రచురించాం. ఈ పుస్తకానికి వసంత కన్నాబిరన్ కాసిన ముందు మాట నుంచి కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాం:
పెరుమాళ్ మురుగన్ చితి (Pyre) పాఠకులను ముప్పిరిగొనే ప్రేమ కథ – ముగ్ధమైన తొలి యవ్వన ప్రేమకి వ్యతిరేకంగా భల్లూకపు పట్టు బిగించే కుల వ్యవస్థను ఇది చిత్రీకరిస్తుంది. మన కాలపు గొప్ప రచయితలలో పెరుమాళ్ మురుగన్ ఒకరు అనటంలో ఎటువంటి సందేహం లేదు. కులాల రూపురేఖలు; నగ్న, దుస్సహ గ్రామీణ పరిసరాలు; రైతాంగ జీవనాలు, వాళ్ల శాశ్వత వివక్షతలు; కష్టాలలో ముందుకు సాగటానికి ఊతమిచ్చే ప్రేమ, ఆదరణలు; ఊరిప్రజల అభిమానంతోపాటు ఉండే క్రూరత్వం వంటివాటినన్నిటిని వాటి వైరుధ్యాలతో పాఠకుల కళ్లకు సజీవంగా చిత్రిస్తాడు రచయిత. గ్రామీణ జీవన వైవిధ్య చిత్రాలను అలవోకగా చిత్రించటం అతడి రచనల ప్రత్యేకత.
గ్రామీణ ప్రాంతాలలోని జీవనశైలులని, కనిపించని కోణాలను ‘చితి’ మన ముందు ఉంచుతుంది. ఊళ్లల్లోలాగానే ఈ నవలలో కూడా ఎక్కడా కులం పేరు ఉండదు. అయితే కథానాయికా, నాయకుల కులాల మధ్య అంతరం స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క సమూహంలో కులం ఒక్కొక్కరకంగా వ్యక్తీకరింపబడుతుందని పాఠకులు అర్థం చేసుకుంటారు. పోలిక ఏదైనా ఉంటే అది వ్యక్తమయ్యే దారుణాలలోనే. అది పట్టువదలకుండా క్రూరంగా వెంటాడుతూనే ఉంటుంది. ఈ యువ జంట ఉండే బండ ప్రాంతం, మండే ఎండ మాదిరి కుల గోడలు కఠినంగా, నిర్దయగా ఉంటాయని మనకు మెల్లగా అవగతమవుతుంది.
కుల వ్యవస్థలోని హింస, మార్పుని సహించకపోవటం గురించి మనకు అవగాహన ఉన్నప్పటికీ మళ్లీ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తటం ఈ నవల గొప్పదనం.
– వసంత కన్నాబిరన్