Description
చుక్, గెక్ అన్నదమ్ములు. అమ్మతో వాళ్లు మాస్కో నగరంలో ఉంటున్నారు. నాన్న భౌగోళిక బృందానికి నాయకుడిగా ఎంతో దూరంలో మంచు ప్రాంతంలో ఉంటున్నాడు. పని ఒత్తిడి వల్ల ఇంటికి రాలేక పోతున్నానని, పిల్లలని తీసుకుని రమ్మని భార్యకి ఉత్తరం రాశాడు.
ఇక చుక్, గెక్‌ల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అంతా ప్రయాణానికి తయారవుతున్నారు. భౌగోళిక బృందం అత్యవసరంగా మరింత లోపలి ప్రాంతానికి వెళ్లాల్సి రావటంతో ప్రయాణం వాయిదా వేసుకోమని టెలిగ్రాం పంపించాడు నాన్న. అమ్మ లేనప్పుడు వచ్చిన ఆ టెలిగ్రాంని చుక్, గెక్‌లు పోగొట్టారు. ఆ విషయం చెప్పకపోతే ఏ సమస్యా ఉండదని వాళ్లు అమాయకంగా అనుకున్నారు.
కానీ, సుదీర్ఘ ప్రయాణం తరవాత శిబిరానికి చేరుకునే సరికి నాన్న అక్కడ లేడు. ఆ మంచు ఎడారిలో ఇద్దరు చిన్న పిల్లలతో అమ్మ అనేక ఇబ్బందులు పడింది. కావలి మనిషి మొరటుగా అనిపించినప్పటికీ ఎంతో అండగా నిలబడ్డాడు. చివరికి భౌగోళిక బృందం తిరిగి రావటంతో అందరూ సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
ఆకతాయిలు చుక్, గెక్ అన్నదమ్మల కథే ఈ పుస్తకం. 1939లో అర్కాది గైదార్ రాసిన కథ ఇది.