Description
సాయంకాలం, దూరం పల్లెలకి పోవాల్సిన పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు వెల్లవేయగా, మరకలు ఏర్పడ్డ తమ క్లాసు రేకులషెడ్స్ని తామే నీళ్ళ బిందెలతో మోసుకొని తెచ్చి, చీపుర్లతో కడిగి శుభ్రపరచడానికి పూనుకొన్నారు. ఎవ్వరూ చెప్పలేదు. వాళ్ళంతట వాళ్ళే అంతంత లావు ప్లాస్టిక్ బిందెలతో నీళ్ళు మోసి, పరిశుభ్రంగా నేలంతా కడిగారు. ఈ అమ్మాయిలంతా మామూలుగా రైతు కుటుంబాల్నించీ వచ్చిన అమ్మాయిలు. శ్రామికతనించీ వచ్చిన వాళ్ళు కొందరు. వాళ్ళు ఎవ్వళ్ళో ఆజ్ఞాపిస్తేకాదు, తమంత తాముగానే ఈ శరీరశ్రమలో పాల్గొన్నారు. నవ్వుతూ, తుళ్ళుతూ ఒకరి ఆధిపత్యం, మార్గదర్శకత్వం లేకుండానే, స్వేచ్ఛగా వాళ్ళు దాదాపు గంటసేపు ఆ పనిలో నిమగ్నులయ్యారు. ‘ఇవ్వి మా క్లాస్షెడ్స్. మేం శుభ్రంగా చేసుకుంటాం.’ అనే చొరవ వాళ్ళలో కనిపించింది. పనిచేస్తే మాసిపోతాం అనే కొందరు, అదంతా చూస్తూ తమకేం పట్టనట్టుండిపోయారు. ముఖ్యంగా ఉద్యోగస్థుల అమ్మాయిలు. వాళ్ళు కొట్ల వెంట తిరిగి, చిరుతిళ్ళు కొని తినమరిగి, తమకోసం ఆటో వస్తే అందులో ఎక్కి, డ్రస్ నలక్కుండా తుర్రుమని వెళ్ళిపోయారు. పనంతా ముగించిన అమ్మాయిఉ, ఆలస్యమయినా బస్స్టాండ్కి కాలినడకనపోయి, బస్సు పట్టుకొని ఊళ్ళు చేరుకున్నారు.
ఏమిటీ విద్యా అంటే, మార్కులు, ర్యాంకులేనా? శ్రామికత, పనీపాటా విద్యలోకి రావా? పనీపాటకీ, కాయకష్టానికీ విద్యలో వున్న స్థానమేమిటి? శుభ్రతని గురించిన స్పందనకి, స్వచ్ఛందమయిన శ్రమప్రవృత్తికీ స్కూల్స్లో, టీచర్స్లో ఏవిధమైన మన్నింపు ఉంది? ఏ గమనికాలేని యాంత్రికపు నికృష్టపు స్కూళ్ళలో, ఈ చదువుల్లో శ్రమించిన వాళ్ళు వెర్రివాళ్ళు, అమాయకులా? ఈ విధమయిన వాతావరణంలో కాయాకష్టం చేసేవాళ్ళని నీచంగా చూట్టంలో అబ్బురమేముంది? ప్రతి సందర్భంలోనూ టీచర్స్ శ్రామికతలోని ఔన్నత్యాన్ని గురించి పిల్లలకి అర్ధమయ్యేలా చెప్పాలి. అయితే శ్రామికతని గౌరవించే టీచర్స్ ఉన్నారా? టీచర్స్ అంటే గుడ్డలు మాయకుండా, నలక్కుండా పాఠాలు చెప్పి, పారిపోయే బాబతేనాయ. టీచర్స్ సమస్యగా తయారయ్యారు. వాళ్ళకేం పట్టదు. ఏం పట్టించుకోరు.