Description
Vidya విద్య
పిల్లల మనస్సు కోమలమైనది. సరియైన మూసలో పోయటానికి అనువుగా వుంటుంది. వారి మనస్సులో వాసనల అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండదు. వారి చేతలు దృఢంగా శక్తివంతంగా వుంటాయి. ప్రాపంచిక భోగలాలసత్వం వారిని స్వాధీనం చేసుకోకముందే నీలాకాశపు పందిరి కింద ఎండ-నీడ ఆటాడుకునే చోట మనసారా ఆడుకోనివ్వండి. గెంతులు వేయనీయండి-ప్రకృతి ఒడి నుండి వారిని లాక్కోకండి యీ సుఖం నుండి వారిని వేరు చేయకండీ. అందమైన ఆకర్షణీయమైన ప్రాతస్సు తన జిలుగు కిరణాలతో వారిపై ప్రతి నూతన ప్రభాత ద్వారాలను తెరువనివ్వండి. చెట్లతో పూతీగలతో అలంకరించిన ప్రకృతి రంగస్థలంపై మారుతున్న రుతువుల వినూత్న దృశ్య జగత్తును వారి ముందుంచండి. మేఘ సేనలను మోహరించి సింహాసనారూఢుడైన వర్షరుతువు ఎండి తపిస్తున్న పృథ్విని ముంచి వేయడాన్ని పొదలనీడలో నిల్చొని వారిని చూడనివ్వండి. శరత్ కాలంలో మంచుతో తడిసి గాలి తాకిడికి సయ్యాటలాడుతూ అనేక రంగులను పులుముకున్న పొలాల అందాలను తమ కళ్లారా చూసి తరించనివ్వండి. తమ జీవితాలను కూడా సస్సశ్యామలం చేసుకోనివ్వండి.