Description
కథలంటే చెవులుకోసుకోని పిల్లలు ఉండరు. రాత్రి గబగబా బువ్వ తిని అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య చుట్టూనో, మంచం మీదకో చేరి కథ వింటూ ఊకొడుతూ నిద్రలోకి జారుకున్న తీపిగుర్తులు ఎందరికో. ఇట్లా కథలు చెప్పేవాళ్ళు ప్రతి ఇంటికీ, లేదా ప్రతి వాడకీ, ఊరికీ కచ్చితంగా ఉండేవాళ్ళు. వీళ్ళు పౌరాణిక, జానపద, సాహస, హాస్య కథలు ఆసువుగా, ఆసక్తిదాయకంగా చెప్పేవాళ్ళు. మారుతున్న పరిస్థితుల్లో మౌఖిక సాంప్రదాయం పోయి లిఖిత సాంప్రదాయం ఏర్పడుతున్న క్రమంలో కథలు చెప్పే స్థానాన్ని కథలు చదవటం ఆక్రమిస్తోంది. మౌఖిక కథలను లిఖిత రూపంలోకి మార్చే కృషి ఈపాటికే మన రాష్ట్రంలో మొదలయ్యింది.
ఇటువంటి ఒక చిన్న ప్రయత్నంతో మంచి పుస్తకం మీ ముందుకు వస్తోంది. శ్రీమతి బి. అన్నపూర్ణ గారు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన కథల్లోంచి ఎనిమిది పౌరాణిక కథలను రాశారు. అవి ఈనాటి పిల్లల్నీ అలరిస్తాయని ఆశిస్తున్నాం.